Friday, July 27, 2018

ఆర్యా 1.100, 101

🌷౧.౧౦౦వ శ్లోకం
జయ జయ జగదమ్బ శివే జయ జయ కామాక్షి జయాద్రిసుతే ।
జయ జయ మహేశదయితే జయ జయ చిద్గగనకౌముదీధారే ॥౧.౧౦౦॥

🌷పదవిభాగం
జయ జయ జగదమ్బ శివే జయ జయ కామాక్షి జయాద్రి-సుతే । జయ జయ మహేశ-దయితే జయ జయ చిద్-గగన-కౌముదీ-ధారే ॥౧.౧౦౦॥

🌷అన్వయం
జగదమ్బ శివే జయ జయ కామాక్షి అద్రిసుతే జయ జయ మహేశదయితే జయ జయ చిద్గగనకౌముదీధారే  జయ జయ ॥౧.౧౦౦॥

🌷ప్రతిపదార్థం
జగద్-అమ్బ = ఓ జగజ్జననీ
శివే = ఓ మంగళస్వరూపురాలా
జయ = జయింపుము
జయ = జయింపుము
కామాక్షి = ఓ కామాక్షీదేవీ
అద్రి-సుతే = ఓ మంచుకొండ కూతురా
జయ = జయింపుము
జయ = జయింపుము
మహేశ-దయితే = శివునిఇల్లాలా
జయ = జయింపుము
జయ = జయింపుము
చిద్గగన-కౌముదీ-ధారే = చిద్గగన మందలిదట్టమయినవెన్నెల ప్రవాహమా
జయ = జయింపుము
జయ = జయింపుము

🌷తాత్పర్యం
ఓ జగజ్జననీ! మంగళస్వరూపిణి వైన నీకు మరల మరల జయము. ఓ కామాక్షీ! హిమగిరి పుత్రికవయిన నీకు జయము జయము. మహేశ్వరుని భార్యవగు నీకు జయము జయము. చిద్గగనము నందలి దట్టమయిన వెన్నెల ప్రవాహమయిన నీకు జయము జయము.

---------------

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౧౦౧వ శ్లోకం
ఆర్యాశతకం భక్త్యా పఠతామార్యాకటాక్షేణ ।
నిస్సరతి వదనకమలాద్వాణీ పీయూషధోరణీ దివ్యా ॥౧.౧౦౧॥


🌷పదవిభాగం
ఆర్యా-శతకం భక్త్యా పఠతామ్ ఆర్యా-కటాక్షేణ । నిస్సరతి వదన-కమలాద్ వాణీ పీయూష-ధోరణీ దివ్యా ॥౧.౧౦౧॥


🌷అన్వయం
భక్త్యా ఆర్యాశతకమ్ పఠతామ్ ఆర్యాకటాక్షేణ వదనకమలాత్ పీయూషవర్షిణీ దివ్యా వాణీ నిస్సరతి ॥౧.౧౦౧॥


🌷ప్రతిపదార్థం
భక్త్యా = భక్తితో
ఆర్యా-శతకమ్ = ఆర్యాశతకమును
పఠతామ్ = చదువువారికి
ఆర్యా-కటాక్షేణ = అమ్మవారి కటాక్షముచేత
వదన-కమలాత్ = ముఖమను కమలమునుండి
పీయూష-వర్షిణీ = అమృతధార వంటి
దివ్యా = దివ్యమైన
వాణీ = వాక్కు
నిస్సరతి = వెలువడును


🌷తాత్పర్యం
భక్తితో ఆర్యాశతకమును పఠించువారి ముఖకమలము నుండి అమృతధార వంటి దివ్యమైన వాక్కు బహిర్గతమగును. 



🌷🌷ఇతి ఆర్యాశతకం సంపూర్ణం🌷🌷

ఆర్యా 1.99

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౯౯వ శ్లోకం
కలమఞ్జులవాగనుమితగలపఞ్జరగతశుకగ్రహౌత్కణ్ఠ్యాత్ ।
అమ్బ రదనామ్బరం తే బిమ్బఫలం శమ్బరారిణా న్యస్తమ్ ॥౧.౯౯॥

🌷పదవిభాగం
కల-మఞ్జుల-వాగ్-అనుమిత-గల-పఞ్జర-గత-శుక-గ్రహ-ఔత్కణ్ఠ్యాత్ । అమ్బ రదన-అమ్బరం తే బిమ్బఫలం శమ్బర-అరిణా న్యస్తమ్ ॥౧.౯౯॥

🌷అన్వయం
అమ్బ, కలమఞ్జులవాగనుమిత-గలపఞ్జరగత-శుకగ్రహౌత్కణ్ఠ్యాత్ తే రదనామ్బరం బిమ్బఫలం శమ్బరారిణా న్యస్తమ్ ॥౧.౯౯॥

🌷ప్రతిపదార్థం
అంబ = అమ్మా
కలమఞ్జులవాగనుమితగలపఞ్జరగతశుకగ్రహౌత్కణ్ఠ్యాత్ >
    కలమఞ్జుల- = అవ్యక్తమధుర
    వాగనుమితగలపంజరగత- = అందమైన వాక్కుచేత తెలియబడిన పంజరమందున్న
    శుకగ్రహణౌత్కణ్ఠ్యాత్ = చిలుకను పట్టు తీవ్ర వాంఛ వలన
తే = నీ యొక్క
రదనామ్బరమ్ = పెదనియనెడు
బిమ్బఫలమ్ = దొండపండు
శమ్బరారిణా = మన్మథుని చేత
న్యస్తమ్ = ఉంచబడినది

🌷తాత్పర్యం
అమ్మా! నీ అవ్యక్త మధుర మంజుల వాక్కు చేత నీ కంఠమను పంజరమందు ఒక చిలుక యున్నదని దానిని పట్టుకొనుటకు ఎఱగా పెదవి యను దొండపండును మన్మథుడు పెట్టినాడు.

ఆర్యా 1.98

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౯౮వ శ్లోకం
అన్తరసి బహిరసి త్వం జన్తుతతేరన్తకాన్తకృదహన్తే ।
చిన్తితసన్తానవతాం సన్తతమపి తన్తనీషి మహిమానమ్ ॥౧.౯౮॥

🌷పదవిభాగం
అన్తః అసి బహిః అసి త్వం జన్తు-తతేః అన్తక-అన్తకృద్-అహన్తే । చిన్తిత-సన్తాన-వతాం సన్తతమ్ అపి తన్తనీషి మహిమానమ్ ॥౧.౯౮॥

🌷అన్వయం
అహన్తే జన్తుతతేః అన్తః అసి బహిః అసి అన్తకాన్తకృత్ సన్తతమ్ చిన్తితసన్తానవతామ్ మహిమానమ్ తన్తనీషి ॥౧.౯౮॥

🌷ప్రతిపదార్థం
అహన్తే = ఓ అహంతారూపిణి
జన్తుతతేః = ప్రాణి చయము యొక్క
అన్తః = లోపల
అసి = ఉన్నావు
బహిః = బయట
అసి = ఉన్నావు
అన్తక-అన్తకృత్ = యముని అంతము చేయు దానవు
సన్తతమ్ = ఎల్లప్పుడు
చిన్తిత-సన్తాన-వతామ్ = ధ్యానముగలవారియొక్క
మహిమానమ్ = మహిమను
తన్తనీషి = విస్తరింపజేసెదవు

🌷తాత్పర్యం
ఓ అహంతా రూపిణీ! కామాక్షీ! నీవు యముని సంహరించు దానివి. జన్తుసమూహము యొక్క లోపల బయట ఉన్నావు. ఎడతెగక ధ్యానము చేయు వాని మహిమను వర్ధిల్ల చేసెదవు.

ఆర్యా 1.97

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౯౭వ శ్లోకం
సత్కృతదేశికచరణాః సబీజనిర్బీజయోగనిశ్రేణ్యా ।
అపవర్గసౌధవలభీమారోహన్త్యమ్బ కేఽపి తవ కృపయా ॥౧.౯౭॥

🌷పదవిభాగం
సత్కృత-దేశిక-చరణాః సబీజ-నిర్బీజ-యోగ-నిశ్రేణ్యా అపవర్గ-సౌధ-వలభీమ్ ఆరోహన్తి అమ్బ కే అపి తవ కృపయా ॥౧.౯౭॥

🌷అన్వయం
అమ్బ సత్కృతదేశికచరణాః కే అపి సబీజనిర్బీజయోగనిశ్రేణ్యా తవ కృపయా అపవర్గసౌధవలభీమ్ ఆరోహన్తి ॥౧.౯౭॥

🌷ప్రతిపదార్థం
అమ్బ = అమ్మా
సత్కృత-దేశిక-చరణాః = సత్కరించిన గురు పాదములుగలవారు
కే అపి = ఎవరో కొందరు
సబీజ-నిర్బీజ-యోగ-నిశ్రేణ్యా = సబీజ నిర్బీజ సమాధుల నిచ్చెన చేత
తవ = నీ యొక్క
కృపయా = దయ చేత
అపవర్గ-సౌధ-వలభీమ్ = మోక్షమను మేడ యొక్క పైన చిన్న ఎత్తుగది, (చంద్రశాల కొణిగ)
ఆరోహన్తి = ఎక్కెదరు

🌷తాత్పర్యం
గురు చరణములు సత్కరించి నీ కృపకు పాత్రులైన ఏ కొందరో ముందు సబీజ సమాధి ఆ తరువాత నిర్బీజ సమాధి అను నీ వరుస మెట్లు గల నిచ్చెన వంటి ఊర్ధ్వయాన మార్గమున ప్రయాణించి మోక్ష సౌధము యొక్క వలభిని చేరుకొందురు.

ఆర్యా 1.96

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౯౬వ శ్లోకం
జలధిద్విగుణితహుతవహదిశాదినేశ్వరకలాశ్వినేయదలైః ।
నలినైర్మహేశి గచ్ఛసి సర్వోత్తరకరకమలదలమమలమ్ ॥౧.౯౬॥

🌷పదవిభాగం
జలధి-ద్విగుణిత-హుతవహ-దిశా-దినేశ్వర-కలా-అశ్వినేయ-దలైః । నలినైః మహేశి గచ్ఛసి సర్వోత్తర-కర-కమల-దలమ్ అమలమ్ ॥౧.౯౬॥

🌷అన్వయం
జలధిద్విగుణితహుతవహదిశాదినేశ్వరకలాశ్వినేయదలైః నళినైః మహేశి అమలమ్ సర్వోత్తరకరకమలదలమ్ గచ్ఛసి ॥౧.౯౬॥

🌷ప్రతిపదార్థం
జలధి-ద్విగుణిత-హుతవహ-దిశా-దినేశ్వర-కలా-అశ్వినేయ-దలైః = నాలుగు, ఆరు, పది, పన్నెండు, పదారు, రెండు దళములుగల
నళినైః = కమలముల మార్గమున
మహేశి = ఓ మహేశ్వరి
అమలమ్ = స్వచ్ఛమైన
సర్వోత్తర-కర-కమల-దలమ్ = అన్నింటి పైనున్న కమలముల యొక్క దలమును
గచ్ఛసి = పొందుచున్నావు

🌷తాత్పర్యం
మూలాధార స్వాధిష్ఠాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్ర షట్కమును దాటి సహస్రార కమలము నందు అమలమయిన శివుడు ఉండు దలమును చేరుచున్నావు.

ఆర్యా 1.95

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౯౫వ శ్లోకం
లోహితిమపుఞ్జమధ్యే మోహితభువనం ముదా నిరీక్షన్తే ।
వదనం తవ కుచయుగలం కాఞ్చీసీమాం చ కేఽపి కామాక్షి ॥౧.౯౫॥

🌷పదవిభాగం
లోహితిమ-పుఞ్జ-మధ్యే మోహిత-భువనం ముదా నిరీక్షన్తే । వదనం తవ కుచ-యుగలం కాఞ్చీ-సీమాం చ కే అపి కామాక్షి ॥౧.౯౫॥

🌷అన్వయం
కామాక్షి లోహితిమపుఞ్జమధ్యే మోహితభువనం తవ వదనం కుచయుగలం కాఞ్చీసీమాం చ కే అపి ముదా నిరీక్షన్తే ॥౧.౯౫॥

🌷ప్రతిపదార్థం
కామాక్షి = ఓ కామాక్షీదేవీ
లోహితిమ-పుఞ్జ-మధ్యే = ఎఱుపుల సమూహముల మధ్య
మోహిత-భువనమ్ = మోహింపచేయబడిన లోకములుగల
తవ = నీయొక్క
వదనమ్ = ముఖమును
కుచ-యుగలమ్ = చనుదోయిని
కాఞ్చీసీమాం చ = కాంచీసీమను
కే అపి = ఎవరో
ముదా = సంతోషముతో
నిరీక్షన్తే = చూచెదరు

🌷తాత్పర్యం
ఎఱుపుకాంతుల నడుమ భువనమును మోహింపచేయు నీ ముఖమును, చనుదోయిని కాంచిని ఎవరో ధన్యులు మాత్రమే చూచెదరు.

ఆర్యా 1.94

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౯౪వ శ్లోకం
కనకమణికలితభూషాం కాలాయసకలహశీలకాన్తికలామ్ ।
కామాక్షి శీలయే త్వాం కపాలశూలాభిరామకరకమలామ్ ॥౧.౯౪॥

🌷పదవిభాగం
కనక-మణి-కలిత-భూషాం కాలాయస-కలహ-శీల-కాన్తి-కలామ్ । కామాక్షి శీలయే త్వాం కపాల-శూల-అభిరామ-కర-కమలామ్ ॥౧.౯౪॥

🌷అన్వయం
కామాక్షి, కనకమణికలితభూషాం కాలాయసకలహశీలకాన్తికలాం కపాలశూలాభిరామకరకమలామ్ త్వాం శీలయే ॥౧.౯౪॥

🌷ప్రతిపదార్థం
కామాక్షి = ఓ కామాక్షీదేవీ
కనక-మణి-కలిత-భూషామ్ = బంగారుతో మణులతో కూడిన సొమ్ములుగల
కాలాయస-కలహ-శీల-కాన్తి-కలామ్ = ఇనుము కలహించు స్వభావము కల కాంతి లేశము గల
కపాల-శూలాభిరామ-కర-కమలామ్ = పుర్రెతో, శూలముచే, అందమైన కరకమలములు గల
త్వామ్ = నిన్ను
శీలయే = ధ్యానించెదను

🌷తాత్పర్యం
ఓ కామాక్షీదేవీ! మణి ఖచిత కనకాభరణములు గల, ఇనుమును మించిన నలుపు కాంతి గల పుర్రెను, శూలమును, పట్టుకున్న చేతులు గల నిన్ను ధ్యానించెదను.

ఆర్యా 1.93

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౯౩వ శ్లోకం
కుఙ్కుమరుచిపిఙ్గమసృక్పఙ్కిలముణ్డాలిమణ్డితం మాతః ।
జయతి తవ రూపధేయం జపపటపుస్తకవరాభయాబ్జకరమ్ ॥౧.౯౩॥

🌷పదవిభాగం
కుఙ్కుమ-రుచి-పిఙ్గమ్ అసృక్పఙ్కిలముణ్డాలిమణ్డితం మాతః । జయతి తవ రూపధేయం జపపటపుస్తకవరాభయాబ్జకరమ్ ॥౧.౯౩॥

🌷అన్వయం
మాతః కుఙ్కుమరుచిపిఙ్గం అసృక్పఙ్కిలముణ్డాలిమణ్డితమ్ జపపటపుస్తకవరాభయాబ్జకరమ్ తవ రూపధేయమ్ జయతి ॥౧.౯౩॥

🌷ప్రతిపదార్థం
మాతః = అమ్మా
కుఙ్కుమ-రుచి-పిఙ్గం = కుంకుమ కాంతితో పింగళ వర్ణముగల
అసృక్-పఙ్కిల-ముణ్డా-ఆలి-మణ్డితమ్ = రక్తపు బురదగల పుర్రెలతో అలంకరించబడిన
జప-పట-పుస్తక-వర-అభయ-అబ్జకరమ్ = జపమాల పుస్తక వరదాభయ ముద్రలుగల కమలముల వంటి చేతులు గల
తవ = నీయొక్క
రూపధేయమ్ = రూపము
జయతి = జయించుచున్నది

🌷తాత్పర్యం
కుంకుమ కాంతిచే పింగల వర్ణమునందిన రక్తపు బురద గల పుఱ్రెల గుంపుచే అలంకరించబడిన, జపమాలను పుస్తకమును వరాభయ ముద్రలను ధరించిన కమలముల వంటి చేతులు కలిగిన నీ రూపము జయించునది.

ఆర్యా 1.92

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౯౨వ శ్లోకం
విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ ।
కామాక్షి పక్ష్మలాక్షీ కలితవిపఞ్చీ విభాసి వైరిఞ్చీ ॥౧.౯౨॥

🌷పదవిభాగం
విమల-పటీ కమల-కుటీ పుస్తక-రుద్రాక్ష-శస్త-హస్త-పుటీ । కామాక్షి పక్ష్మల-అక్షీ కలిత-విపఞ్చీ విభాసి వైరిఞ్చీ ॥౧.౯౨॥

🌷అన్వయం
కామాక్షి, విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ పక్ష్మలాక్షీ కలితవిపఞ్చీ వైరిఞ్చీ విభాసి ॥౧.౯౨॥

🌷ప్రతిపదార్థం
కామాక్షీ = ఓ కామాక్షీదేవీ
విమలపటీ = శుభ్ర వస్త్రము గల
కమలకుటీ = కమలము కుటీరముగా గల
పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ = పుస్తకము చేత రుద్రాక్షల చేత పవిత్రములని ప్రశంసనీయములైన చేతుల ముడుపు గల
పక్ష్మలాక్షీ = ఱెప్పలతో కూడిన కన్నులు గల
కలితవిపఞ్చీ = ధరించిన వీణ గల
వైరిఞ్చీ = బ్రాహ్మివి
విభా = కాంతివి
అసి = అయి ఉన్నావు

🌷తాత్పర్యం
ఓ కామాక్షీ! శుభ్రములయిన తెల్లని వస్త్రములను ధరించిన కమలము నివాసమైన పుస్తక రుద్రాక్షలు దాల్చుట చేత పవిత్రములని ప్రశంసనీయములయిన చేతులు గల ఱెప్పలు అధికముగానున్న కన్నులు గల, వీణ ధరించిన సరస్వతివి నీవే.

ఆర్యా 1.91

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౯౧వ శ్లోకం
స్మరమథనవరణలోలా మన్మథహేలావిలాసమణిశాలా ।
కనకరుచిశౌర్యశీలా త్వమమ్బ బాలా కరాబ్జధృతమాలా ॥౧.౯౧॥

🌷పదవిభాగం
స్మర-మథన-వరణ-లోలా మన్మథ-హేలా-విలాస-మణి-శాలా । కనక-రుచి-శౌర్య-శీలా త్వమ్ అమ్బ బాలా కర-అబ్జ-ధృత-మాలా ॥౧.౯౧॥

🌷అన్వయం
అమ్బ, స్మరమథనవరణలోలా మన్మథహేలావిలాసమణిశాలా కనకరుచిశౌర్యశీలా కరాబ్జధృతమాలా త్వమ్ బాలా ॥౧.౯౧॥

🌷ప్రతిపదార్థం
అమ్బ = అమ్మా
స్మర-మథన-వరణలోలా = మన్మథుని మథించిన వానిని వరించుట యందాసక్తి గల
మన్మథ-హేలా = మన్మథుని హేలయైన
కనక-రుచి-చౌర్యశీలా = బంగరు కాంతిని దొంగిలించు స్వభావము గల
కరాబ్జ-ధృత-మాలా = హస్త కమలమున ధరించిన మాల గల
బాలా = బాలవు
త్వమ్ = నీవు

🌷తాత్పర్యం
మన్మథుని రూపమే అనదగిన అమ్మవారు మన్మథుని మథించిన శివుని వరించుటయందు ఆసక్తిగల, బంగారు కాంతిని దొంగిలించు స్వభావముగల, చేత మాల ధరించిన నీవు బాలా దేవివే.

ఆర్యా 1.90

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౯౦వ శ్లోకం
తాడితరిపుపరిపీడనభయహరణనిపుణహలముసలా ।
క్రోడపతిభీషణముఖీ క్రీడసి జగతి త్వమేవ కామాక్షి ॥౧.౯౦॥

🌷పదవిభాగం
తాడిత-రిపు-పరిపీడన-భయహరణ-నిపుణ-హల-ముసలా క్రోడపతి-భీషణ-ముఖీ క్రీడసి జగతి త్వమ్ ఏవ కామాక్షి ॥౧.౯౦॥

🌷అన్వయం
కామాక్షి, తాడితరిపుపరిపీడన-భయహరణనిపుణహలముసలా । క్రోడపతిభీషణముఖీ జగతి త్వమేవ క్రీడసి ॥౧.౯౦॥

🌷ప్రతిపదార్థం
కామాక్షి = కామాక్షీదేవీ
తాడితరిపుపరిపీడన-భయహరణనిపుణహలముసలా >
    తాడితరిపు- = కొట్టబడిన శత్రువు గల
    పరిపీడనభయహరణ- = మిక్కిలి పీడనము వలన గలిగిన భయమును హరించుట లో
    నిపుణహలముసలా = నిపుణములైన హల ముసలములు గల
క్రోడపతిభీషణముఖీ = వరాహ పతి ముఖము వంటి భీషణమైన ముఖము గలదానా
త్వమ్ ఏవ = నీవే
జగతి = జగమున
క్రీడసి = క్రీడించుచున్నావు

🌷తాత్పర్యం
శత్రు సైన్యమును దండించునది, శత్రు భయమును పోగొట్టుటలో సమర్థములగు హల ముసలములు గలిగిన వారాహీ దేవివయి నీవే జగత్తునందు క్రీడించుచున్నావు.

ఆర్యా 1.89

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౮౯వ శ్లోకం
ఉర్వీధరేన్ద్రకన్యే దర్వీభరితేన భక్తపూరేణ ।
గుర్వీమకిఞ్చనార్తిం ఖర్వీకురుషే త్వమేవ కామాక్షి ॥౧.౮౯॥

🌷పదవిభాగం
ఉర్వీధర-ఇన్ద్ర-కన్యే దర్వీభరితేన భక్త-పూరేణ గుర్వీమ్ అకిఞ్చన-ఆర్తిం ఖర్వీకురుషే త్వమ్ ఏవ కామాక్షి ॥౧.౮౯॥

🌷అన్వయం
ఉర్వీధరేన్ద్రకన్యే, కామాక్షి, దర్వీభరితేన భక్తపూరేణ త్వమేవ గుర్వీమ్ అకిఞ్చనార్తిం ఖర్వీకురుషే ॥౧.౮౯॥

🌷ప్రతిపదార్థం
ఉర్వీ-ధర-ఇన్ద్ర-కన్యే = హిమవంతుని కుమార్తెవైన
కామాక్షి = ఓ కామాక్షీ దేవీ
దర్వీ-భరితేన = గరిటెలో నింపబడిన
భక్త-పూరేణ = నిండుగా అన్నంతో
త్వమ్ ఏవ = నీవే
గుర్వీమ్ = గొప్పదయిన
అకిఞ్చన-ఆర్తిమ్ = పేదవారి బాధను
ఖర్వీకురుషే = తగ్గించుచున్నావు

🌷తాత్పర్యం
అన్నార్తులగు భక్తులకు గరిటెలో నింపనడిన అన్నపు ముద్దచే తృప్తి కలిగించి వారి బాధను పోగొట్టుదువు.

ఆర్యా 1.88

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౮౮వ శ్లోకం
శ్రవణచలద్వేదణ్డా సమరోద్దణ్డా ధుతాసురశిఖణ్డా ।
దేవి! కలితాన్త్రషణ్డా ధృతనరముణ్డా త్వమేవ చాముణ్డా ॥౧.౮౮॥

🌷పదవిభాగం
శ్రవణ-చలద్-వేదణ్డా సమర-ఉద్దణ్డా ధుత-అసుర-శిఖణ్డా । దేవి! కలిత-అన్త్ర-షణ్డా ధృత-నర-ముణ్డా త్వమ్ ఏవ చాముణ్డా ॥౧.౮౮॥

🌷అన్వయం
దేవి! శ్రవణచలద్వేదణ్డా సమరోద్దణ్డా ధుతాసురశిఖణ్డా కలితాన్త్రషణ్డా ధృతనరముణ్డా చాముణ్డా త్వమ్ ఏవ ॥౧.౮౮॥

🌷ప్రతిపదార్థం
దేవి = ఓదేవీ
శ్రవణ-చలద్-వేదణ్డా = చెవుల యందూగుచున్న ఏనుగులు గలది
సమర-ఉద్ధణ్డా = యుద్ధమునందు ఉద్ధతయైన
ధుత-అసుర-శిఖణ్డా = కదిలించబడిన రాక్షసుల నెమిలి పించములు గల
కలిత-అన్త్ర-షణ్డా = ధరించిన పేగుల గుంపులు గల
ధృత-నర-ముణ్డా = ధరించిన మనుష్యుల తలలు గల
చాముణ్డా = చాముండవు
త్వం ఏవ = నీవే

🌷తాత్పర్యం
చెవుల యందు ఏనుగులు ఊగులాడుతున్నవి. రాక్షసుల కిరీటముల యందలి నెమలి ఈకలు కదలి పోయినవి. పేగులను వేసుకున్నది, మనుష్యుల తలలను ధరించి నదియు అగు ఈ చాముండా స్వరూపము నీదే.

ఆర్యా 1.87

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౮౭వ శ్లోకం
ప్రణతజనతాపవర్గా కృతరణసర్గా ససింహసంసర్గా ।
కామాక్షి ముదితభర్గా హతరిపువర్గా త్వమేవ సా దుర్గా ॥౧.౮౭॥

🌷పదవిభాగం
ప్రణత-జనతా-అపవర్గా కృత-రణ-సర్గా ససింహ-సంసర్గా । కామాక్షి ముదిత-భర్గా హత-రిపు-వర్గా త్వమ్ ఏవ సా దుర్గా ॥౧.౮౭॥

🌷అన్వయం
కామాక్షి, ప్రణతజనతాపవర్గా కృతరణసర్గా ససింహసంసర్గా ముదితభర్గా హతరిపువర్గా సా దుర్గా త్వమ్ ఏవ ॥౧.౮౭॥

🌷ప్రతిపదార్థం
కామాక్షి = ఓ కామాక్షీ దేవీ
ప్రణతజనతాపవర్గా = ప్రణమిల్లిన జన సమూహమునకు ముక్తివగు
కృతరణసర్గా = చేయబడిన యుద్ధముల సృష్టి గల
ససింహసంసర్గా = సింహ సంబంధముతో గూడిన
ముదితభర్గా = సంతోషించిన శివుడు గల
హతరిపువర్గా = చంపబడ్డ శత్రు సమూహము గల
సా = ఆ
దుర్గా = దుర్గవు
త్వం ఏవ = నీవే

🌷తాత్పర్యం
నమస్కరించు జనులకు మోక్షమొసగునది, యుద్ధములను సృష్టించునది, సింహమును వాహనముగా చేసుకున్నది, శివుని సంతసింపజేయునది శత్రువులను నాశనము చేయునది అగు కామాక్షీ దేవి దుర్గయే.

ఆర్యా 1.86

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౮౬వ శ్లోకం
అఙ్కే శుకినీ గీతే కౌతికినీ పరిసరే చ గాయకినీ ।
జయసి సవిధేఽమ్బ! భైరవమణ్డలినీ శ్రవసి శఙ్ఖకుణ్డలినీ ॥౧.౮౬॥

🌷పదవిభాగం
అఙ్కే శుకినీ గీతే కౌతికినీ పరిసరే చ గాయకినీ జయసి సవిధే అమ్బ! భైరవమణ్డలినీ శ్రవసి శఙ్ఖ-కుణ్డలినీ ॥౧.౮౬॥

🌷అన్వయం
అమ్బ అఙ్కే శుకినీ గీతే కౌతుకినీ పరిసరే చ గాయకినీ శ్రవసి శఙ్ఖకుణ్డలినీ సవిధే భైరవమణ్డలినీ జయసి ॥౧.౮౬॥

🌷ప్రతిపదార్థం
అమ్బ = అమ్మా
అఙ్కే = తొడయందు
శుకినీ = చిలుక గలది
గీతే = పాట యందు
కౌతుకినీ = కౌతుకము గలది
పరిసరే చ = చుట్టు పక్కలందును
గాయకినీ = గాయకులు గలది
శ్రవసి = చెవి యందు
శఙ్ఖకుణ్డలినీ = శంఖ కుండలములు గలది
సవిధే = సమీపమున
భైరవమణ్డలినీ = భైరవ మండలమున నున్న నీవు
జయసి = జయించెదవు

🌷తాత్పర్యం
ఆమె తొడపై చిలుక ఉన్నది. ఆమెకు పాట అనిన ఇష్టము. ఆమె చుట్టు పక్కల గాయకిలు కలరు. ఆమె చెవులకు శంఖకుండలములు ఉన్నవి. ఆమె చుట్టు భైరవులు ఉన్నారు. ఈ స్వరూపముతో నీవు నా సమీపముననే ఉన్నావు.

ఆర్యా 1.85

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౮౫వ శ్లోకం
మదజలతమాలపత్రా వసనితపత్రా కరాదృతఖనిత్రా ।
విహరతి పులిన్దయోషా గుఞ్జాభూషా ఫణీన్ద్రకృతవేషా ॥౧.౮౫॥

🌷పదవిభాగం
మద-జల-తమాల-పత్రా వసనిత-పత్రా కరాదృతఖనిత్రా । విహరతి పులిన్ద-యోషా గుఞ్జా-భూషా ఫణీన్ద్ర-కృత-వేషా ॥౧.౮౫॥

🌷అన్వయం
మదజలతమాలపత్రా వసనితపత్రా కరాదృతఖనిత్రా పులిన్దయోషా గుఞ్జాభూషా ఫణీన్ద్రకృతవేషా విహరతి ॥౧.౮౫॥

🌷ప్రతిపదార్థం
మద-జల-తమాల-పత్రా = మద జలము తమాల పత్రముగా గల
వసనిత-పత్రా = వస్త్రముగా చేసుకొన్న ఆకులు గల
కర-ఆదృత-ఖనిత్రా = చేత ధరించిన గడ్డ పాఱగల
గుఞ్జా-భూషా = గురువింద పూసల అలంకారములు గల
ఫణీన్ద్ర-కృత-వేషా = సర్పరాజుచే చేయబడ్డ వేషము గల
పుళిన్ద-యోషా = కిరాత స్త్రీ
విహరతి = విహరించుచున్నది

🌷తాత్పర్యం
మదజలము తమాల పత్రముగా గల, ఆకులు చీరగా ధరించిన, చేతిలో గడ్డపార ధరించిన, గురువింద పూసల నగలు ధరించిన సర్పములను అలంకారముగా ధరించిన కిరాతస్త్రీ విహరించుచున్నది.

ఆర్యా 1.84

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౮౪వ శ్లోకం
దగ్ధమదనస్య శమ్భోః ప్రథీయసీం బ్రహ్మచర్యవైదగ్ధీమ్ ।
తవ దేవి తరుణిమశ్రీచతురిమపాకో న చక్షమే మాతః ॥౧.౮౪॥

🌷పదవిభాగం
దగ్ధ-మదనస్య శమ్భోః ప్రథీయసీం బ్రహ్మచర్య-వైదగ్ధీమ్ । తవ దేవి తరుణిమ-శ్రీ-చతురిమ-పాకో న చక్షమే మాతః ॥౧.౮౪॥

🌷అన్వయం
మాతః తవ తరుణిమశ్రీచతురిమపాకో దగ్ధమదనస్య శమ్భోః ప్రథీయసీమ్ బ్రహ్మచర్య-వైదగ్ధీమ్ న చక్షమే ॥౧.౮౪॥

🌷ప్రతిపదార్థం
మాతః = అమ్మా
తవ = నీ యొక్క
తరుణిమశ్రీచతురిమపాకో >
    తరుణిమశ్రీ- = యౌవన శోభా
    చతురిమపాకః = చాతుర్య పాకము
దగ్ధమదనస్య = కాల్చబడిన కాముడుగల
శమ్భోః = శివుని యొక్క
ప్రథీయసీమ్ = ప్రసిద్ధమైన
బ్రహ్మచర్య-వైదగ్ధీమ్ = బ్రహ్మచర్య నిపుణతను
న చక్షమే = క్షమించలేదు

🌷తాత్పర్యం
అమ్మా! నీ యౌవన శోభా చాతుర్య పాకము మన్మథుని కాల్చిన శివుని ప్రసిద్ధమయిన బ్రహ్మచర్య నిపుణతను క్షమించలేదు.

ఆర్యా 1.83

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౮౩వ శ్లోకం
పరిచితకమ్పాతీరం పర్వతరాజన్యసుకృతసన్నాహమ్ ।
పరగురుకృపయా వీక్షే పరమశివోత్సుఙ్గమఙ్గలాభరణమ్ ॥౧.౮౩॥

🌷పదవిభాగం
పరిచిత-కమ్పా-తీరం పర్వత-రాజన్య-సుకృత-సన్నాహమ్ । పరగురు-కృపయా వీక్షే పరమ-శివ-ఉత్సుఙ్గ-మఙ్గల-ఆభరణమ్ ॥౧.౮౩॥

🌷అన్వయం
పరిచితకమ్పాతీరమ్ పర్వతరాజన్యసుకృతసన్నాహమ్ పరమశివోత్సఙ్గ-మఙ్గలాభరణం పరగురుకృపయా వీక్షే ॥౧.౮౩॥

🌷ప్రతిపదార్థం
పరిచిత-కమ్పా-తీరమ్ = పరిచితమైన కంపానదీ తీరముగల
పర్వతరాజన్యసుకృతసన్నాహమ్ >
    పర్వత-రాజన్య- = హిమవంతుని యొక్క
    సుకృత-సన్నాహమ్ = సుకృతముల సమూహమైన
పరమశివోత్సుఙ్గమఙ్గలాభరణమ్ >
    పరమ-శివ-ఉత్సఙ్గ- = పరమశివుని అంకమునకు
    మఙ్గల-ఆభరణమ్ = మంగళాభరణమయిన అమ్మవారిని
పర-గురు-కృపయా = పరమ గురుని దయ చేత
వీక్షే = చూచెదను

🌷తాత్పర్యం
కంపానదీ తీరముతో పరిచయము గల హిమవంతుని పుణ్యముల సమూహమయిన, పరమ శివుని ఒడికి మంగళాభరణమయిన అమ్మవారిని, పరమగురుని కృపతో చూచెదను.

ఆర్యా 1.82

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౮౨వ శ్లోకం
అధికాఞ్చితమణికాఞ్చనకాఞ్చీమధికాఞ్చి కాఞ్చిదద్రాక్షమ్ ।
అవనతజనానుకమ్పామనుకమ్పాకూలమస్మదనుకూలామ్ ॥౧.౮౨॥

🌷పదవిభాగం
అధిక-అఞ్చిత-మణి-కాఞ్చన-కాఞ్చీమ్ అధికాఞ్చి కాఞ్చిద్ అద్రాక్షమ్ । అవనత-జన-అనుకమ్పామ్ అనుకమ్పా-కూలమ్ అస్మద్ అనుకూలామ్ ॥౧.౮౨॥

🌷అన్వయం
అధికాఞ్చితమణికాఞ్చనకాఞ్చీమ్ అవనతజనానుకమ్పామ్ అస్మదనుకూలామ్ కాఞ్చిత్ అనుకమ్పాకూలమ్ అధికాఞ్చి అద్రాక్షమ్ ॥౧.౮౨॥

🌷ప్రతిపదార్థం
అధిక-అఞ్చిత-మణి-కాఞ్చన-కాఞ్చీమ్ = మిక్కిలి పూజనీయమైన మణులు పొదిగిన బంగారు ఒడ్డాణము గల
అవనత-జన-అనుకమ్పామ్ = నమస్కరించిన జనులయందు దయ గల
అస్మద్-అనుకూలామ్ = మాకు అనుకూలమైన
కాఞ్చిత్ = ఒకానొక దానిని
అనుకమ్పా-కూలమ్ = కంపానదీ తీరమున
అధికాఞ్చి = కాంచీనగరమున
అద్రాక్షమ్ = చూచితిని

🌷తాత్పర్యం
కమ్పానదీ తీరమున కాంచీ నగరమున మిక్కిలి పూజనీయ మణి కాంచిని ధరించిన, మాకు అనుకూలమైన, నమస్కరించిన వారి యందు దయగలిగిన ఒకానొక తల్లిని చూచితిని.

ఆర్యా 1.81

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౮౧వ శ్లోకం
వేదణ్డకుమ్భడమ్బరవైతణ్డికకుచభరార్తమధ్యాయ ।
కుఙ్కుమరుచే నమస్యాం శఙ్కరనయనామృతాయ రచయామః ॥౧.౮౧॥

🌷పదవిభాగం
వేదణ్డ-కుమ్భ-డమ్బర-వైతణ్డిక-కుచ-భర-ఆర్త-మధ్యాయ । కుఙ్కుమ-రుచే నమస్యాం శఙ్కర-నయన-అమృతాయ రచయామః ॥౧.౮౧॥

🌷అన్వయం
వేదణ్డకుమ్భడమ్బరవైతణ్డికకుచభరార్తమధ్యాయ కుఙ్కుమరుచే శఙ్కరనయనామృతాయ నమస్యామ్ రచయామః ॥౧.౮౧॥

🌷ప్రతిపదార్థం
వేదణ్డ-కుమ్భ-డమ్బర-వైతణ్డిక-కుచ-భర-ఆర్త-మధ్యాయ = గజ కుంభముల ఆడంబరముతో వినోదించు కుచముల భారముతో పీడితమైన నడుము గల
కుఙ్కుమ-రుచే = కుంకుమ వన్నె గల
శఙ్కర-నయన-అమృతాయ = శివుని నేత్రములకు అమృతమైన అమ్మవారికి
నమస్యామ్ = నమస్సును
రచయామః = చేయుచున్నాను

🌷తాత్పర్యం
అమ్మవారి కుచభరము ఏనుగు కుంభస్థలమున ఔన్నత్యముతో నినదించుచున్నట్లు ఉన్నది. ఆ కుచభరముచే నడుము మిక్కిలి పీడించబడి చిక్కినట్లున్నది. అమ్మవారు శివుని కన్నులకు ఎఱ్రని అమృతము వలె ఆస్వాద్యమై యున్నది.

ఆర్యా 1.80

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౮౦వ శ్లోకం
దేశిక ఇతి కిం శఙ్కే తత్తాదృక్తవ ను తరుణిమోన్మేషః ।
కామాక్షి! శూలపాణేః కామాగమసమయతన్త్రదీక్షాయామ్ ॥౧.౮౦॥

🌷పదవిభాగం
దేశిక ఇతి కిం శఙ్కే తత్ తాదృక్ తవ ను తరుణిమ-ఉన్మేషః । కామాక్షి! శూల-పాణేః కామ-ఆగమ-సమయ-తన్త్ర-దీక్షాయామ్ ॥౧.౮౦॥

🌷అన్వయం
కామాక్షి తవ తత్తాదృక్ తరుణిమోన్మేషః శూలపాణేః కామాగమ-సమయతన్త్రదీక్షాయామ్ దేశిక ఇతి కిం ను శఙ్కే ॥౧.౮౦॥

🌷ప్రతిపదార్థం
కామాక్షి = ఓ కామాక్షీ
తవ = నీ యొక్క
తత్ తాదృక్ = తత్త్వదర్శియైన
తరుణిమ-ఉన్మేషః = యౌవనోదయము
శూలపాణేః = శివునకు
కామ-ఆగమ-సమయ-తన్త్ర-దీక్షాయామ్ = మన్మథ విద్య తంత్ర దీక్షయందు
దేశిక ఇతి కిం ను = గురువు వలె ఆచరించుచున్నదా అని
శఙ్కే = సందేహించుచున్నాను

🌷తాత్పర్యం
అమ్మా! కామాక్షీ! శివా! తత్వదర్శియైన నీ యౌవనోదయము శివునకు కామవిద్యా సమయ తన్త్ర దీక్ష యందు గురుత్వము వహించుచున్నదా ఏమి?

ఆర్యా 1.79

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౭౯వ శ్లోకం
మాలిని మహేశచాలిని కాఞ్చీఖేలిని విపక్షకాలిని తే ।
శూలిని విద్రుమశాలిని సురజనపాలిని కపాలిని నమోఽస్తు ॥౧.౭౯॥

🌷పదవిభాగం
మాలిని మహేశ-చాలిని కాఞ్చీ-ఖేలిని విపక్ష-కాలిని తే । శూలిని విద్రుమ-శాలిని సురజన-పాలిని కపాలిని నమః అస్తు ॥౧.౭౯॥

🌷అన్వయం
మాలిని మహేశచాలిని కాఞ్చీఖేలిని విపక్షకాలిని తే । శూలిని విద్రుమశాలిని సురజనపాలిని కపాలిని నమః అస్తు ॥౧.౭౯॥

🌷ప్రతిపదార్థం
మాలిని = మాల కలదానా
మహేశ-చాలిని = మహేశుని కదిలించుదానా
కాఞ్చీ-ఖేలిని = కాంచీ నగరమున ఆడుకొనుదానా
విపక్ష-కాలిని = శత్రువులను సంహరించుదానా
శూలిని = శూలము కలదానా
విద్రుమ-శాలిని = పగడముల వలె ఒప్పుదానా
సుర-జన-పాలిని = సురజనులను పాలించుదానా
కపాలిని = కపాలముకలదానా
తే = నీకు
నమః = నమస్సులు
అస్తు = అగుగాక

🌷తాత్పర్యం
మాలను ధరించుదానా! మహేశుని కదిలించుదానా! కాంచీ నగరమందు ఆడుకొనుదానా! శత్రువులను సంహరించుదానా! పగడములను ధరించుదానా! సురజనులను పాలించుదానా! కపాలము ధరించుదానా! నీకు నా నమస్సులు.

ఆర్యా 1.78

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౭౮వ శ్లోకం
విద్యే విధాతృవిషయే కాత్యాయని కాలి కామకోటికలే ।
భారతి భైరవి భద్రే శాకిని శామ్భవి శివే స్తువే భవతీమ్ ॥౧.౭౮॥

🌷పదవిభాగం
విద్యే విధాతృ-విషయే కాత్యాయని కాలి కామకోటి-కలే । భారతి భైరవి భద్రే శాకిని శామ్భవి శివే స్తువే భవతీమ్ ॥౧.౭౮॥

🌷అన్వయం
విద్యే విధాతృవిషయే కాత్యాయని కాలి కామకోటికలే భారతి భైరవి భద్రే శాకిని శామ్భవి శివే భవతీం స్తువే ॥౧.౭౮॥

🌷ప్రతిపదార్థం
విద్యే = ఓ విద్యా
విధాతృవిషయే = బ్రహ్మకు తెలియబడుదానా
కాత్యాయని = కాత్యాయనీ
కాలి = ఓ కాలీ
కామకోటికలే = కామకోటీశ్వరుడగు చంద్రుని కలయైనదానా
భారతి = వాగ్రూపిణియైన దానా
భైరవి = భైరవుని భార్యయైన దానా
భద్రే = భద్రతా స్వరూపము గల దానా
శాకిని = శాకినీ స్వరూపము గల దానా
శామ్భవి = శంభు తత్త్వ స్వరూపిణీ
శివే = మంగళ స్వరూపురాలా
భవతీమ్ = నిన్ను
స్తువే = స్తుతించుచున్నాను

🌷తాత్పర్యం
అమ్మవారు విద్యాస్వరూపిణి కాత్యాయని, కాలి, కామకోటి కళ, సరస్వతీ స్వరూపిణి. మంగళ స్వరూపిణి. భద్రతా స్వరూపిణి. శాకినీ స్వరూపిణి, శంభు తత్వ స్వరూపిణి. అట్టి అమ్మవారిని స్తుతించెదను.

ఆర్యా 1.77

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౭౭వ శ్లోకం
ప్రత్యఙ్ముఖ్యా దృష్ట్యా ప్రసాదదీపాఙ్కురేణ కామాక్ష్యాః ।
పశ్యామి నిస్తులమహో పచేలిమం కిమపి పరశివోల్లాసమ్ ॥౧.౭౭॥

🌷పదవిభాగం
ప్రత్యఙ్ముఖ్యా దృష్ట్యా ప్రసాద-దీప-అఙ్కురేణ కామాక్ష్యాః । పశ్యామి నిస్తులమ్ అహో పచేలిమం కిమ్ అపి పరశివ-ఉల్లాసమ్ ॥౧.౭౭॥

🌷అన్వయం
కామాక్ష్యాః ప్రసాదదీపాఙ్కురేణ ప్రత్యఙ్ముఖ్యా దృష్ట్యా నిస్తులమ్ పచేలిమమ్ కిమపి పరశివోల్లాసమ్ పశ్యామి అహో ॥౧.౭౭॥

🌷ప్రతిపదార్థం
కామాక్ష్యాః = కామాక్షీ దేవి యొక్క
ప్రసాద-దీప-అఙ్కురేణ = అనుగ్రహ దీపపు మొలకయైన
ప్రత్యఙ్ముఖ్యా = ప్రత్యఙ్ముఖియైన
దృష్ట్యా = చూపు చేత
నిస్తులమ్ = సాటి లేని
పచేలిమమ్ = పండిన
కిమ్ అపి = ఒకానొక
పరశివ-ఉల్లాసమ్ = పరశివుని ఉల్లాసమును- అమ్మవారిని
పశ్యామి = చూచుచున్నాను
అహో = ఆహా

🌷తాత్పర్యం
అమ్మవారి అనుగ్రహముచే గలిగిన ప్రత్యన్ముఖి దృష్టి చేత సాటి లేని పండిన పర శివోల్లాసమని చెప్పదగిన అమ్మవారిని చూచుచున్నాను.

ఆర్యా 1.76

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౭౬వ శ్లోకం
కుటిలం చటులం పృథులం మృదులం కచనయనజఘనచరణేషు । అవలోకితమవలమ్బితమధికమ్పాతటమమేయమస్మాభిః ॥౧.౭౬॥


🌷పదవిభాగం
కుటిలం చటులం పృథులం మృదులం కచ-నయన-జఘన-చరణేషు । అవలోకితమ్ అవలమ్బితమ్ అధికమ్పా-తటమ్ అమేయమ్ అస్మాభిః ॥౧.౭౬॥


🌷అన్వయం
కచనయనజఘనచరణేషు కుటిలం చటులం పృథులమ్ మృదులమ్ అధికమ్పాతటమ్ అవలోకితమ్ అమేయమ్ అస్మాభిః అవలమ్బితమ్ ॥౧.౭౬॥


🌷ప్రతిపదార్థం
కచ-నయన-జఘన-చరణేషు = కేశ, నేత్ర, కటి, పాదములయందు
కుటిలమ్ = వంకరయైన
చటులమ్ = చంచలమైన
పృథులమ్ = విశాలమైన
మృదులమ్ = మృదువైన
అధికమ్పా-తటమ్ = కంపానదీ తీరమున
అవలోకితమ్ = చూడబడిన
అమేయమ్ = ప్రమాణములకందనిది
అస్మాభిః = మా చేత
అవలమ్బితమ్ = ఆశ్రయించబడినది


🌷తాత్పర్యం
వక్ర కేశములు, చంచల నేత్రములు, విశాల జఘనము, మృదు చరణములు గలిగి కంపానదీ తీరమున కనబడునట్టి అమ్మవారే మా చేత ఆశ్రయించబడినది. ఆమె ఏ ప్రమాణములచేతను తెలియరానిదై యున్నది.

ఆర్యా 1.75

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౭౫వ శ్లోకం
పురమథనపుణ్యకోటీ పుఞ్జితకవిలోకసూక్తిరసధాటీ ।
మనసి మమ కామకోటీ విహరతు కరుణావిపాకపరిపాటీ ॥౧.౭౫॥

🌷పదవిభాగం
పుర-మథన-పుణ్య-కోటీ పుఞ్జిత-కవి-లోక-సూక్తి-రస-ధాటీ । మనసి మమ కామ-కోటీ విహరతు కరుణా-విపాక-పరిపాటీ ॥౧.౭౫॥

🌷అన్వయం
పురమథనపుణ్యకోటీ పుఞ్జితకవిలోకసూక్తిరసధాటీ కరుణావిపాకపరిపాటీ కామకోటీ మమ మనసి విహరతు ॥౧.౭౫॥

🌷ప్రతిపదార్థం
పుర-మథన-పుణ్య-కోటీ = పురముల మథించిన, శివుని కోటి పుణ్యముల స్వరూపమైన
పుఞ్జితకవిలోకసూక్తిరసధాటీ >
    పుఞ్జిత-కవి-లోక-సూక్తి- = పుఞ్జీభవించిన కవి లోకసూక్తుల యందలి
    రసధాటీ = రసము యొక్క వేగమైన
కరుణావిపాకపరిపాటీ >
    కరుణా- = దయ యొక్క
    విపాక- = పరిణామపు
    పరిపాటీ = సంప్రదాయమైన
కామకోటీ = కామకోటి పీఠ రూపిణియైన అమ్మవారు
మమ = నా యొక్క
మనసి = మనసున
విహరతు = విహరించుగాక

🌷తాత్పర్యం
శివుని కోటి పుణ్యముల మూర్తి, కవి లోక సూక్తుల పుంజీ భావము, కరుణా పరిణామ సంప్రదాయమును, కామకోటి పీఠ దేవతయునైన అమ్మవారు నా మనసున విహరించుగాక.

ఆర్యా 1.74


ఆర్యా 1.73

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౭౩వ శ్లోకం
మూర్తిమతి ముక్తిబీజే మూర్ధ్ని స్తబకితచకోరసామ్రాజ్యే ।
మోదితకమ్పాకూలే ముహుర్ముహుర్మనసి ముముదిషాస్మాకమ్ ॥౧.౭౩॥

🌷పదవిభాగం
మూర్తిమతి ముక్తి-బీజే మూర్ధ్ని స్తబకిత-చకోర-సామ్రాజ్యే । మోదిత-కమ్పా-కూలే ముహుః ముహుః మనసి ముముదిషా అస్మాకమ్ ॥౧.౭౩॥

🌷అన్వయం
మూర్తిమతి ముక్తిబీజే మూర్ధ్ని స్తబకితచకోరసామ్రాజ్యే మోదితకమ్పాకూలే ముహుర్ముహుః అస్మాకం మనసి ముముదిషా ॥౧.౭౩॥

🌷ప్రతిపదార్థం
మూర్తిమతి = ఆకారము గల
ముక్తి-బీజే = ముక్తి కారణమైన
మూర్ధ్ని = శిరమున
స్తబకిత-చకోర-సామ్రాజ్యే = పూగుత్తిగా చేయబడ్డ చంద్రుడు గల
మోదిత-కమ్పాకూలే = సంతోషింప చేసిన కంపా తీరముగల అమ్మవారి యందు
ముహుః ముహుః = మాటిమాటికి
అస్మాకం = మాకు
మనసి = మనసున
ముముదిషా = ఆనందించు కోరిక ఉన్నది

🌷తాత్పర్యం
ఆకారముగల ముక్తిహేతువయిన, శిరమున చంద్రుని పూగుత్తి వలె ధరించిన, కంపాతీరము నానందింపజేసిన అమ్మవారి వలన సంతోషము పొందవలెనను కోరిక నా మనమున మాటిమాటికి కలుగుచున్నది.

ఆర్యా 1.72

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౭౨వ శ్లోకం
లీయే పురహరజాయే మాయే తవ తరుణపల్లవచ్ఛాయే ।
చరణే చన్ద్రాభరణే కాఞ్చీశరణే నతార్తిసంహరణే ॥౧.౭౨॥

🌷పదవిభాగం
లీయే పురహర-జాయే మాయే తవ తరుణ-పల్లవ-చ్ఛాయే । చరణే చన్ద్ర-ఆభరణే కాఞ్చీ-శరణే నత-ఆర్తి-సంహరణే ॥౧.౭౨॥

🌷అన్వయం
చన్ద్రాభరణే పురహరజాయే మాయే తరుణపల్లవచ్ఛాయే కాఞ్చీశరణే నతార్తిసంహరణే తవ చరణే లీయే ॥౧.౭౨॥

🌷ప్రతిపదార్థం
చన్ద్ర-ఆభరణే = చంద్రుడు అవతంసముగా గలదానా
పురహర-జాయే = శివునకు భార్యయైనదానా
మాయే = ఓ మాయా
తరుణ-పల్లవ-చ్ఛాయే = లేచి గుళ్ళ వంటి కాంతి గల దానా
కాఞ్చీ-శరణే = కాంచి ఇల్లుగా గలదానా
నత-ఆర్తి-సంహరణే = నమస్కరించు వారి బాధలు పోగొట్టుదానా
తవ = నీ యొక్క
చరణే = పాదమందు
లీయే = దాగియుందును

🌷తాత్పర్యం
అమ్మవారు శివునకు భార్య. మాయా స్వరూపిణి. లేత చిగురువలె ఎఱ్రనయినది. చంద్రుని శిరమున అలంకరించుకొనినది. నమస్కరించువారి బాధలను పోగొట్టునది. కాంచీనగర నివాసిని. ఇట్టి అమ్మవారి పాదమున దాగికొందును.

ఆర్యా 1.71

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౭౧వ శ్లోకం
రక్ష్యోఽస్మి కామపీఠీలాసికయా ఘనకృపామ్బురాశికయా ।
శ్రుతియువతికున్తలీమణిమాలికయా తుహినశైలబాలికయా ॥౧.౭౧॥

🌷పదవిభాగం
రక్ష్యః అస్మి కామపీఠీ-లాసికయా ఘన-కృపా-అమ్బు-రాశికయా । శ్రుతి-యువతి-కున్తలీ-మణి-మాలికయా తుహిన-శైల-బాలికయా ॥౧.౭౧॥

🌷అన్వయం
కామపీఠీలాలికయా ఘనకృపామ్బురాశికయా శ్రుతియువతికున్తలీ-మణిమాలికయా తుహినశైలబాలికయా రక్ష్యః అస్మి ॥౧.౭౧॥

🌷ప్రతిపదార్థం
కామ-పీఠీ-లాసికయా = కామ పీఠము ఊయెలగాగల
ఘన-కృపా-అమ్బు-రాశికయా = గొప్ప దయా జలమునకు వర్షాకాలమైన
శ్రుతి-యువతి-కున్తలీ-మణి-మాలికయా = శ్రుతిపడుచుల కేశములలో మణి హారమయిన
తుహిన-శైల-బాలికయా = హిమ గిరిపుత్రిక చేత
రక్ష్యః అస్మి = రక్షించదగినవాడను అగుతున్నాను

🌷తాత్పర్యం
కామపీఠమను ఊయలగల గొప్ప దయాజలమునకు వర్షాకాలమగు శ్రుతులు అను పడుచుల కేశములలోని మణిహారమయిన హిమగిరి బాలికచే రక్షింపదగినవాడను.

ఆర్యా 1.70

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౭౦వ శ్లోకం
మఞ్చే సదాశివమయే పరశివమయలలితపౌష్పపర్యఙ్కే ।
అధిచక్రమధ్యమాస్తే కామాక్షీ నామ కిమపి మమ భాగ్యమ్ ॥౧.౭౦॥

🌷పదవిభాగం
మఞ్చే సదాశివ-మయే పరశివ-మయ-లలిత-పౌష్ప-పర్యఙ్కే । అధిచక్ర-మధ్యమ్ ఆస్తే కామాక్షీ నామ కిమ్ అపి మమ భాగ్యమ్ ॥౧.౭౦॥

🌷అన్వయం
అధిచక్రమధ్యమ్ పరశివమయలలిత-పౌష్పపర్యఙ్కే సదాశివమయే మఞ్చే కామాక్షీ నామ కిమ్ అపి మమ భాగ్యమ్ ఆస్తే ॥౧.౭౦॥

🌷ప్రతిపదార్థం
అధిచక్రమధ్యమ్ = శ్రీచక్రమధ్య మున
పరశివ-మయ-లలిత-పౌష్ప-పర్యఙ్కే = పరశివుడను సుందరమైన పుష్పపర్యంకమున
సదాశివ-మయే = సదాశివ మయమగు
మఞ్చే = మంచమునందు
కామాక్షీ నామ = కామాక్షీ దేవియను
కిమ్ అపి = ఒకానొక
మమ = నా యొక్క
భాగ్యమ్ = భాగ్యము
ఆస్తే = కూర్చుని యున్నది

🌷తాత్పర్యం
శ్రీచక్ర మధ్యమున పరశివుడను పుష్ప పర్యంకము గల సదా శివ మయమయిన మంచము నందు కామాక్షీ దేవి యనెడి నా భాగ్యము కూర్చొనియున్నది.

ఆర్యా 1.69

🌷మూకపఞ్చశతీ - ఆర్యాశతకము🌷
🌷౧.౬౯వ శ్లోకం
కిం వా ఫలతి మమాన్యైర్బిమ్బాధరచుమ్బిమన్దహాసముఖీ ।
సమ్బాధకరీ తమసామమ్బా జాగర్తి మనసి కామాక్షీ ॥౧.౬౯॥

🌷పదవిభాగం
కిం వా ఫలతి మమ అన్యైః బిమ్బ-అధర-చుమ్బి-మన్దహాస-ముఖీ । సమ్బాధకరీ తమసామ్ అమ్బా జాగర్తి మనసి కామాక్షీ ॥౧.౬౯॥

🌷అన్వయం
మమ అన్యైః కిం వా ఫలతి బింబాధరచుమ్బి-మన్దహాసముఖీ తమసామ్ సమ్బాధకరీ కామాక్షీ అమ్బా మనసి జాగర్తి ॥౧.౬౯॥

🌷ప్రతిపదార్థం
మమ = నాకు
అన్యైః = ఇతరులతో
కిం వా ఫలతి = ఫలించునదేమున్నది
బింబాధరచుమ్బి-మన్దహాసముఖీ >
          బిమ్బ-అధర-చుమ్బి = దొండ పండు వంటి కింది పెదవిని ముద్దిడుకొను
          మన్దహాస-ముఖీ = చిఱునవ్వు ముఖముగల
తమసామ్ = చీకట్లకు
సమ్బాధకరీ = అత్యంత నాశము కలిగించు
కామాక్షీ అమ్బా = కామాక్షి అమ్మ
మనసి = మనస్సునందు
జాగర్తి = మేలుకొనియున్నది

🌷తాత్పర్యం
చీకట్లను మరల రాకుండా నశింప చేయునట్టి దొండపండు వంటి పెదవిని ముద్దిడుకొనునట్టి చిఱునవ్వు మోము గల కామాక్షి అమ్మ నా మనస్సున మేల్కొని యుండగా నాకితర దేవతలన ఫలమేమున్నది?