Wednesday, July 18, 2018

పరిచయం

మూకశంకరులు (మూకకవి) అమ్మవారి అనుగ్రహంతో వ్రాసిన ఈ ఐదువందల పద్యాల నిచయం భక్తకోటికి దేవీ ఉపాసకులకు పెన్నిధి. 

[వివరాలకోసం- 
https://sarasabharati-vuyyuru.com/2016/12/14/గీర్వాణ-కవుల-కవితా-గీర్వ-203/
http://shaktiputram.blogspot.com/2011/09/blog-post_21.html ]
మా సంస్కృతసంస్కృతీ వాట్సాప్ సదస్సులో జరిగిన బృహత్ సత్కార్యాలలో ఈ మూకపంచశతీ ఒకటి. దీని టంకణం మాన్య శ్రీమతి బండారు శివకామసుందరి గారు చేశారు. పుస్తకం ఆధారంగా వారు అందించిన శ్లోకం, ప్రతిపదార్థం, తాత్పర్యం (గ్రంథవివరాలు ఇవ్వబడినవి) ఆధారంగా పదవిభాగం, మరియు అన్వయం నేను అందించాను. దానితో ఈ భక్తకవి కృతి ఒక సంస్కృత అధ్యయనానికి తగినదిగా ఏర్పడింది. దీనకి సంధి, సమాసాది వివరాలు ఇవ్వాలని మనసు ఉవ్విళ్ళూరుతున్నప్పటికీ ప్రస్తుతం సమయాభావం, శక్త్యభావం చేత అయినంతవరకు సంస్కృతార్థలకు అందిద్దామని, ఆ పని చేయగలిగినప్పుడు మళ్ళీ దాన్ని పునః జోడించవచ్చు అనే ఆలోచనతో ఇంత అందిస్తున్నాము.
 
మూకమహాకవిప్రణీత మూకపంచశతీ
సారోల్లాసినీ వ్యాఖ్యా
(ఆంధ్రప్రతిపదార్థ తాత్పర్యం వివరణ)
దోర్బల విశ్వనాథశర్మ
ప్రకాశికా- రావి కృష్ణకుమారీ
చీరాల
------------------

సంస్కృతం శ్లోకం తో కూడిన గ్రంథాన్ని అధ్యయనం చేసే విధానం-
1.    మొదలు మూల శ్లోకం, తరువాత అదే క్రమంలో మిగిలినదంతా – పదవిభాగాదులను చదవటం.
2.    పూర్తి అయినాక మళ్ళీ విరుద్ధ దిశగా కిందనుండి పైకి చదివటం. అంటే తెలుగు అనువాదం, ప్రతిపదార్థం, అన్వయం – అట్లా.
3.    తరువాత అనువాదంలోని ఫలానా తెలుగు పదం మూలంలో ఎక్కడున్నది- అని ఊహిస్తూ మూలంలోనైనా పదవిభాగంలోనైనా చూసుకోవటం.
4.    సంస్కృతవాక్యం అన్వయక్రమం ప్రకారం తెలుగు అనువాదాన్ని సరిపోల్చుకోవటం. అది ఒకసారి, ఇది ఒకసారి చదవటం.
5.    సంధులను పదవిభాగంలోనే శ్లోకాధ్యయనం చివరలో సంధుల దృష్టితో మరోసారి చదవటం మంచిది. (పేర్లు తెలియకపోయినా ఫరవాలేదు, ఈ స్థాయిలో పదాన్ని విడదీసే విధానం తెలిస్తే చాలు)
6.    సమాసాలను ప్రతిపదార్థంలో చదివి సద్వినియోగం చేసుకోవటం మంచిది. (ఈ స్థాయిలో సమాసాల పేర్లు తెలియకపోయినా ఫరవాలేదు, విగ్రహం రాకపోయినా విడదీసే విధానం తెలిస్తే చాలు అని భావం.)
7.    ఏవైనా ప్రయోగవిశేషాలు గమనించటం- ‘ఓహో, ఈ భావాన్ని వ్యక్తపరచాలంటే ఈ పదాన్ని సంస్కృతంలో ఇట్లా వాడతారన్నమాట.. బాగుంది.’ అని నుడికారాన్ని గమనించటం వల్ల భవిష్యత్తులో మంచి లాభం జరుగుతుంది. అవి సూచించే ప్రయత్నం చేయాలని అనుకున్నా. సమయాభావం, మరియు కార్యభారం వల్ల చేయలేకపోయాను. కనుక మీరు స్వయంగా గ్రహించటం, గుర్తించి ప్రయోగాలలో అలవాటు చేసుకోవటం మంచిది.
8.    చివరగా స్వీయపరీక్ష- (లేదా ఎవరి చేతనైనా అడిగించుకోటం)
అ) ఏదైనా సంస్కృతపదాన్ని చదివి, తెలుగు చూడకుండా అర్థం గుర్తు తెచ్చుకోవటం.
ఆ) ఏదైనా తెలుగుపదాన్ని చదివి, సంస్కృతం చూడకుండా మూలపదం గుర్తు తెచ్చుకోవటం.
ఇ) అట్లాగే సంధి, సమాసం చూసుకోవటం
9.    ఇంత చేసేసరికి శ్లోకంలో పదాలన్ని నోటికి వచ్చినట్టు అవుతుంది. అప్పుడు మరో రెండు మూడు సార్లు చదివేస్తే శ్లోకం నోటికి వచ్చేస్తుంది.
10.    చివ్వరగా సంస్కృతశ్లోకాన్ని చదువుతూ భావాన్ని లోపల అనుకోవటం. ఇక్కడ ఏ పదమూ ఆటంకం కలగకపోతే ఇంక ఆ శ్లోకం మనకు అవగతమైనట్టే.
    ఈ పద్ధతిని మీరిక్కడే కాదు, ఎక్కడైనా ఇతరత్రా కూడా వాడుకోవచ్చు. శ్లోకరూపంలో ఉన్నది, సానువాదం లభించిన ఏ సంస్కృతం గ్రంథాన్ని అయినా ఇట్లాగే చదివి లాభం పొందవచ్చు.
    ఇట్లా చేయటం వల్ల విషయం మొత్తం అవగతమై, సంస్కృతాన్ని మూలంనుంచే ఆనందించి, లాభం పొందుతారని ఆదరిస్తారని ఆశతో-
-మీ సంస్కృతానురాగిణి
సంకా ఉషారాణి
 

No comments:

Post a Comment